బంజారా భాషను 8వ షెడ్యూల్​లో చేర్చాలి : మంత్రి సీతక్క

బంజారా భాషను 8వ షెడ్యూల్​లో చేర్చాలి : మంత్రి సీతక్క
  • అసెంబ్లీలో తీర్మానం చేసి  కేంద్రానికి పంపుతం: మంత్రి సీతక్క
  • ఎస్టీల సంక్షేమం కోసం రూ.17 వేల కోట్లు కేటాయించాం
  • సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: బంజారా భాషను అధికారంగా గుర్తించి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తోపాటు ఐటీడీఏలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందన్నారు. శనివారం బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ 286 జయంతి వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, అనీల్ కుమార్ యాదవ్, విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు.

లంబాడి, గిరిజన సాంప్రదాయాల ప్రకారం మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి మంత్రి సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాల వేసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..  సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు గతంలో రూ. కోటి కేటాయిస్తే ఇప్పుడు రూ.2 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 286 ఏండ్ల క్రితం జన్మించిన సంతు సేవాలాల్ ఎప్పటికీ చిరస్మరణీయుడేనని, సేవా సిద్ధాంతాలే ఆయనను సజీవంగా నిలుపుతున్నాయన్నారు.

ఎస్టీల సంక్షేమ కోసం బడ్జెట్​లో రూ.17 వేల కోట్లు కేటాయించామని, గత సర్కారు హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ ను డైవర్ట్ చేసి ఇతర స్కీమ్ లకు కేటాయించారని మంత్రి ఆరోపించారు. బంజారాలను సంచార జీవితం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు, బంజారాల స్థిర నివాసం కోసం తండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సేవలాల్ అని మంత్రి కొనియాడారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరవొద్దని, వేష భాషలను మర్చిపోవద్దని, బంజారా డ్రెస్ లు ధరించాలని సూచించారు.

మన జాతి గురించి సగర్వంగా చెప్పుకోవాలని, జాతి ప్రయోజనాలు పొందుతున్నా.. జాతి గురించి చెప్పుకునేందుకు కొందరు ఇబ్బందులు పడుతుంటారని అన్నారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని ఎల్ బీ స్టేడియంలో నిర్వహించాలని సీఎంను కోరుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో లక్ష మంది ఎస్టీ పిల్లలు చదివేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు.